మోటార్లకు మీటర్లు పెడితే ప్రతిఘటిస్తాం.ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ..
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకువచ్చి రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులపై అదనపు భారాన్ని వేయడానికి సిద్ధమైందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయడానికి పూనుకోవడం
- By V.VKR --
- Tuesday, 19 Jul, 2022
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకువచ్చి రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులపై అదనపు భారాన్ని వేయడానికి సిద్ధమైందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఖండించింది. మంగళవారం కార్మిక కర్షక భవన్ లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కర్నూలు,కల్లూరు, దేవనకొండ,పత్తికొండ, ఆస్పరి,ఆదోని,కౌతాళం, తుగ్గలి,ఓర్వకల్లు మండలాల నుండి రైతు సంఘం నాయకులు హాజరయ్యారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మోటర్లకు మీటర్లు బిగిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని,వాటిని ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలో 90 వేల కరెంటు మోటార్లు ఉన్నాయని,వీటికి మీటర్లు బిగిస్తే రైతుల మెడలకు ఉరితాలుగా మారతాయని అన్నారు.ఇప్పటికే కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పంటలు లేక,పండిన పంటలకు ధర లేక,పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు కరెంటు మోటార్లకు మీటర్లు పెడితే గోరుచుట్టుపై రోకటి పోటులా ఉంటుందని అన్నారు.కావున రైతుల పక్షపాతి అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోటర్లకు మీటర్లు పెట్టే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా స్థానికంగా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని, భీమా రానీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.రబిలో నష్టపోయిన రైతులకు కూడా బీమా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ప్రధానంగా ఆలూరు,ఆదోని,పత్తికొండ, ఆస్పరి ప్రాంతాల్లో జింకల బెడదతో రైతులు ఆందోళన చెందుతున్నారు.తక్షణమే ఫారెస్ట్ అధికారులు వాటిని అరికట్టే దానికోసం చర్యలు చేపట్టాలని కోరారు.జిల్లాలో వివిధ ప్రాజెక్టులు కింద భూములు సేకరిస్తున్నారు. వాటికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన నష్టపరిహారం ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి శాశ్వతంగా కరువును పారద్రోలాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా ఉపాధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పోరాటాలపై అనేక సూచనలు సలహాలు చేశారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. కృష్ణ,సూరి,సంజన్న,జిల్లా నాయకులు అయ్యప్ప, మధు,సిద్దయ్య గౌడ్, వెంకటేశ్వర్లు,రంగస్వామి, కొండారెడ్డి,శ్రీనివాసులు,జి. ఆంజనేయులు,దేవపుత్ర, బడే సాహెబ్,తదితరులు పాల్గొన్నారు.
V.VKR