కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటాం
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వెల్లడించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే మోడీ సర్కారుపై రణ నినాదంతో ముందుకెళ్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్
- By khaja --
- Monday, 04 Apr, 2022
* వడ్లను కొనుగోలు చేయకుంటే మోడీ సర్కారుపై రణ నినాదంతో ముందుకెళ్తామ్
* దేశ వ్యాప్తంగా వన్ నేషన్-వన్ ప్రోక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేయాలి
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన దీక్షలు : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వెల్లడించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే మోడీ సర్కారుపై రణ నినాదంతో ముందుకెళ్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కేంద్రంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. దీనిలో భాగంగా సోమవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి నల్లమోతు భాస్కర్ రావు నిరసన దీక్షలను ప్రారంభించారు. తెలంగాణ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను భాస్కర్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆహార భద్రతా చట్టాన్ని మోడీ సర్కారు తుంగలో తొక్కిందని, తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష కనబరుస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతు సోదరులు, రైతు సంఘాల నేతలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం మేరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈనెల 5న జాతీయ రహదారిపై రాస్తా రోకో, 7న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు, 8న మిర్యాలగూడ నియోజకకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఈనెల11న హస్తిన లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపడతారని చెప్పారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోగా అవమానకర, అహంకారపూరిత ధోరణిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను నూకలు తినిపించడం అలవాటు చేయాలని పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా ఉచిత సలహాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి అవమానించిన గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేన్నయినా సహిస్తారు...కానీ,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోరని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ బాయిల్డ్ రైస్ ఎగుమతి లెక్కలన్నీ బయటపెడుతామని హెచ్చరించారు. మోడీ సర్కారు వైఖరి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణలో పండిన వరిధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులను, ప్రజలను అవమానించిందని, బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల కారణంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల ఫలితంగా స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజలు, రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బీజేపీ అసలు రూపం బయటపెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుమానించారని అన్నారు. రాష్ట్ర మంత్రులకు పని లేకుండా ఢిల్లీ వస్తున్నారని గోయల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, సీనియర్ నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, మదార్ బాబా, జొన్నలగడ్డ రంగారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య,పత్తిపాటి నవాబ్, సాధినేని శ్రీనివాస్ రావు, ఖాదర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, స్థానిక ప్రజప్రతినిధులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
khaja