ఇవాళే పార్లమెంట్ ముందుకు విద్యుత్ చట్ట సవరణ బిల్లు
విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు 8) పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టంతో విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది.
- By khaja --
- Monday, 08 Aug, 2022
దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు..
విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు 8) పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టంతో విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది. ఇది విద్యుత్ పంపిణీ రంగంలో పోటీ వాతావరణాన్ని ఏర్పరుస్తుందని.. తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్ సప్లై పొందే అవకాశం ఉంటుందని కేంద్రం చెబుతుంది. అయితే ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆయా రాష్ట్రాలు బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా విద్యుత్ ఉద్యోగుల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుతో తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనుంది. అర్థరాత్రి నుంచే ఉద్యోగులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో చేపట్టనున్న ఆందోళనల్లో విద్యుత్ సంఘాలు పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంఘాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బీజేపీ నేతలు,ఎంపీలు, కేంద్రమంత్రుల ఇళ్లకు పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకెళ్తే నిరవధిక సమ్మె చేపడుతామన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్ సప్లైకి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ విద్యుత్ సప్లై నిలిచిపోతే వెంటనే పునరుద్ధరణ సాధ్యపడదని.. ఇందుకు ప్రజలు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమేనని విమర్శిస్తోంది.
khaja