కొండల్ని మింగేస్తున్న జగన్ గ్యాంగ్.. తెదేపా ఫోటో ప్రదర్శన
సీఎం జగన్ మోహన్‌రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా మార్చేసిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు. దోచుకుంటూ.. పర్యావరణ విధ్వంసం చేయమని
- By khaja --
- Wednesday, 13 Jul, 2022
మంగళగిరి: సీఎం జగన్ మోహన్‌రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా మార్చేసిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు. దోచుకుంటూ.. పర్యావరణ విధ్వంసం చేయమని ప్రజలు జగన్‌కి అధికారం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 అడవుల్ని నాశనం చేశారని ఆరోపించారు. పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పేనని హెచ్చరించారు.మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'కొండల్ని మింగేస్తున్న వైకాపా భూబకాసురులు' పేరిట ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైకాపా మాఫియా దోపిడీ సొమ్ము విలువ దాదాపు రూ.1.62 లక్షల కోట్లని ప్రదర్శనలో పేర్కొన్నారు. భూ మాఫియా రూ.25 వేల కోట్లు, ఇసుక ద్వారా రూ.10 వేల కోట్లు, మైనింగ్ రూ.25 వేల కోట్లు, మద్యం రూ.15 వేల కోట్లు, డ్రగ్స్ రూ.21వేల కోట్లు, గంజాయి మాఫియా రూ.8వేల కోట్లు, రేషన్ బియ్యం మాఫియా రూ.4వేల కోట్లు, ఎర్రచందనం రూ.25 వేల కోట్లు, సిమెంట్ మాఫియా రూ.12వేల కోట్లు, సెంటు భూమి పట్టాల్లో రూ.7వేల కోట్లు, అంబులెన్స్, బియ్యం వ్యాన్లు, విద్యుత్ తదితర కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్లు దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ రుషికొండను ధ్వంస చేశారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ-తూర్పు గోదావరి సరిహద్దు బమిడికలొద్దిలో భారతీ సిమెంట్ కోసం లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫొటోలు ప్రదర్శించారు. కుప్పంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ధ్వజమెత్తారు. కర్నూల్‌లో ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి రవ్వలకొండను తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా బండపల్లె కొండను పెద్దరెడ్డి అనుచరులు మాయం చేశారంటూ ఫొటోలు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 62 మంది చనిపోయారని ఆరోపించారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వైకాపా నేతలు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సంబంధిత ఫొటోలను ప్రదర్శనలో మీడియాకు చూపించారు.
khaja