ప్రశాంత వాతావరణంలో ఆత్మకూరు ఉప ఎన్నికలు నిర్వహిస్తాం-కలెక్టర్
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు
- By khaja --
- Tuesday, 31 May, 2022
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. సోమవారం ఉదయం ఆత్మకూరు ఆర్.డి.ఓ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి జారీ చేశారన్నారు. ఆర్.డి.ఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణకు ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన రోజు నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో వుందని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు చెక్ పోస్టులను, మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అంతర్ జిల్లాల సరిహద్దు బార్డర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు పటిష్టంగా చేపడుతున్నట్లు, ముఖ్యంగా ఈ.వి.ఎం.ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.1,000 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రానికి అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.122 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఈ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టడంతో పాటు పోలీసు సిబ్బంది కేటాయింపు ప్రత్యేకంగా చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 279 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవికాలం దృష్ట్యా పోలింగ్ రోజున ఓటర్లుకు త్రాగునీటి సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. జూన్ 23వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ వుంటుందని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ శాతం పోలింగ్ జరిగేలా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
khaja