ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలు
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలు
అసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో దరఖాస్తుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండల కేంద్రానికి చెందిన మామిడి నాగయ్య తన తల్లి పేరిట పట్టా భూమి ఉందని, ఇట్టి భూమిని తమ అన్నదమ్ములకు సమాన వాటాగా పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని తొమ్మిదవ వార్డు కౌశల్ నగర్ కు చెందిన కాలనీవాసులు వారి కాలనీలో రోడ్డుపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఇందువలన నడవడానికి ఇబ్బందికరంగా మారిందని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. అడ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిసిందని, ఈ శాఖలో ఆడ పరిధిలోని 54 గ్రామాల రైతుల ఖాతాల లావాదేవీలు జరుగుతున్నాయని, ఈ శాఖను తరలిస్తే జిల్లా కేంద్రానికి వెళ్లడానికి వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుందని, ఈ శాఖను ఇక్కడే కొనసాగించాలని కోరుతూ ఖాతాదారులు దరఖాస్తు అందజేశారు. మాజీ సైనిక ఉద్యోగులకు కాగజ్ నగర్ పట్టణంలో మాజీ సైనిక ఉద్యోగుల భవన నిర్మాణం కొరకు 2 గుంటల భూమిని కేటాయించాలని కోరుతూ మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సొసైటీ కార్యనిర్వాహక కార్యదర్శి కె. శివ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి లక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవించే నిరుపేదరాలు అయిన తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన జె. లక్ష్మి తనకు ఖేడేగాం గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, తన భూమి ధరణి పోర్టల్ లో నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందని, ఇట్టి భూమిని జాబితా నుండి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA