ఉస్మానియా ఆసుపత్రి భవనం సురక్షితం కాదు...!
ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ప్రస్తుత స్థితిలో ఉపయోగించుకోవడం సురక్షితంకాదని, అందులోనూ దవాఖానాగా అసలు వినియోగించుకోరాదని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తే దాని జీవితం కాలం పెరుగతుందని పేర్కొంది
- By khaja --
- Saturday, 23 Jul, 2022
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ప్రస్తుత స్థితిలో ఉపయోగించుకోవడం సురక్షితంకాదని, అందులోనూ దవాఖానాగా అసలు వినియోగించుకోరాదని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తే దాని జీవితం కాలం పెరుగతుందని పేర్కొంది. మరమ్మతుల అనంతరం ఆసుపత్రి మినహా ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చంది. వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నందున దాని పరిరక్షణకు ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో తగిన మరమ్మతులు చేపట్టాలంది. ఆసుపత్రి కోసం ఈ భవనాన్ని వినియోగించుకోవాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉందని.. ఆక్సిజన్ పైపులైను, గ్యాస్‌లైన్, ఏసీ లైన్‌లు, వాటర్ పైపులైన్‌లు, మురుగునీటి ఏర్పాట్లు వంటి పలు సౌకర్యాలు కల్పించాలని, ఇవన్నీ వారసత్వ కట్టడం, దాని నిర్మాణ పటిష్ఠతపై ప్రభావం చూపుతాయని వివరించింది. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేయాలని, ఇది వారసత్వ కట్టడం అయినందున దీన్ని కూల్చకుండా పరిరక్షణ చేపట్టాలంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి గడువు కావాలని ఏజీ కోరారు. ఈ నివేదిక కాపీలను పిటిషనర్లతోపాటు ప్రతివాదులకు అందజేయాలని, అందరూ అధ్యయనం చేశాక దీనిపై విచారణ చేపడతామంటూ విచారణను ఆగస్టుకు 25కు వాయిదా వేసింది.
నిపుణుల కమిటీ పరిశీలన
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యశాఖల ఈఎన్‌సీలు, జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్‌లతో కలిపి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అది మార్చి 19న తనిఖీ నిర్వహించి ఎన్‌ఐటీ వరంగల్ నిపుణుల సాయం తీసుకోవడంతోపాటు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కమిటీలో స్వతంత్ర వ్యక్తులను చేర్చాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ సూపరింటెండెంటింగ్ ఇంజనీరులను కమిటీలో చేర్చింది. స్టెడ్రంట్ టెక్నో క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భవన పటిష్ఠతపై పరీక్షలు నిర్వహించగా కొంత మేర బలహీనంగా ఉందని, తుప్పుబట్టిన ప్రాంతాల్లో పరీక్షలు అవసరమని పేర్కొంది. అయితే ఈ నివేదికకు అదనంగా మరొకరి అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. స్వతంత్ర సభ్యులతోపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సమావేశమై ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ప్రస్తుత స్థితిలో ఉపయోగించుకోవడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.
khaja