తెలంగాణలో మరో మహానగరం..
జీవో 111 ఉపసంహరణ నేపథ్యంలో ఆ భూముల్లో మహా నగరాన్ని నిర్మిస్తే.. అక్కడి ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. కొత్త నగరంలో భూముల క్రయవిక్రయాలు పెరిగి.. రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని యోచిస్తున్నారు
- By Admin --
- Wednesday, 13 Apr, 2022
ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరం కిక్కిరిసిపోయింది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఖాళీ స్థలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను ఆనుకొని మరో మహనగరాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్‌ను తలదన్నేలా.. సువిశాలమైన రహదారులతో.. పచ్చని ప్రకృతితో.. కొత్త నగరాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను (GO 111) ఉపసహరించుకున్నట్లు తెలుస్తోంది. జీవో 111 పరిధిలోకి వచ్చే ప్రాంతంలోనే గ్రీన్ సిటీ ని నిర్మించనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంతో పాటు భారీగా ఆదాయం తెస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది.
హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల కింద 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ఉన్న భూముల విస్తీర్ణం 1.82 లక్షల ఎకరాలు. ఇందులో 70 శాతం ఖాళీగానే ఉన్నాయి. ఈ భూముల్లోనే గ్రీన్ సిటీగా మరో మహానగరాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశాల్లో సీఎం తన ఆలోచనలు వెల్లడించారట. ఇక్కడ నిర్మించబోయే సిటీలో ప్రధాన రోడ్లన్నింటినీ కౌలాలంపూర్ తరహాలో 200 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని, రోడ్డుకు రెండు వైపులా పచ్చని వనాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అధికారులతో చెప్పినట్లు సమాచారం.