నెల తక్కువ.. మోత ఎక్కువ!
హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్ వాడితే బిల్లు తక్కువ రావాలి
- By Admin --
- Saturday, 09 Apr, 2022
హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్ వాడితే బిల్లు తక్కువ రావాలి కానీ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరిలో 31 రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లేశారు. మార్చిలో నెల పూర్తవకముందే 27 రోజులకే రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. 27 రోజుల్లో 178 యూనిట్లు వాడగా 31 రోజులకు 204 యూనిట్లు వాడతారని అంచనా వేసి 200 యూనిట్లకు పైగా వినియోగానికి సంబంధించిన శ్లాబును వర్తింపజేశారు.
ఈ శ్లాబు కింద.. తొలి 200 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.5 చొప్పున, తర్వాత 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీలు వర్తిస్తాయి. 204 యూనిట్లు వాడినట్టు అంచనా వేసినందున తొలి 200 యూనిట్లకు ఓ రేటు.. మిగిన 4 యూనిట్లకు మరో రేటు వర్తించనుంది. ఈ లెక్కన అసలు వాడిన 178 యూనిట్లలో 174 యూనిట్లకు యూనిట్‌కు రూ.5 చొప్పున, మిగిలిన 4 యూనిట్లకు యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీ విధించారు. ఈ దెబ్బకు చార్జీ రూ.898 (174్ఠ5 + 4్ఠ7.20) కు పెరిగింది. రూ.60 కస్టమర్ చార్జీలు, రూ.10 ఈడీ కలిపి బిల్లు రూ.969కు పెరిగింది. నెల కాకముందే బిల్లులు జారీ చేసి వినియోగదారులకు డిస్కంలు ఎలా టోపీ పెడుతున్నాయో ఈ కేసుతో అర్థమవుతుంది.