sadfgtre

అవసరమైతే మరో 10,000 టీచర్ పోస్టుల భర్తీ...

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అవసరమైతే మరో 10,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు.

తెలంగాణలో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి మరో శుభవార్త. అవసరమైతే మరో 10,000 టీచర్ పోస్టుల్ని (Teacher Jobs) భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. సాధారణంగా ప్రైవేట్ సెక్టార్‌లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయని, ప్రభుత్వ రంగంలో జాబ్స్ (Govt Jobs) తక్కువని అన్నారు. గవర్నమెంట్ జాబ్‌తో ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి యువత ఈ ఉద్యోగాల కోసం ఎక్కువగా పోటీ పడుతుంటారని, కానీ అందరికీ ఉద్యోగాలు రావడం సాధ్యం కాదన్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల్లో కూడా మరో 5000 నుంచి10000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతీ ఏటా ఏర్పడే ఖాళాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.

ఇక స్కూళ్ల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, స్కూళ్ల రేషనలైజేషన్ ద్వారా పాఠశాలల్ని మూసివేస్తారన్న ప్రచారం తప్పని ఖండించారు. తాము స్కూళ్లను మూయబోమని తెలిపారు. ప్రతీ పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్ట్‌ల టీచర్స్ ఉండాలన్నది తమ ఉద్దేశమని, అందుకే ప్రతీ స్కూల్‌లో ప్రతీ సబ్జెక్ట్ టీచర్ ఉండేలా రేషనలైజేషన్ చేస్తామని ప్రకటించారు. కావాలంటే మరో 10,000 టీచర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు.

తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 91,142 ఖాళీలు గుర్తించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయగా 80,039 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వీటిలో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 7,878 పోస్టులు ఉన్నాయి. అంటే 20,964 పోస్టులు భర్తీ కానున్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అదే జరిగితే టీచర్ ఉద్యోగాలు కోరుకునేవారికి అవకాశాలు పెరగనున్నాయి.

ఇప్పటివరకు ప్రకటించిన పోస్టుల్లో 6,500 పోస్టులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు కావడం విశేషం. 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఖాళీల వివరాలను సేకరించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు... ఆర్థికశాఖ ఆమోదం రాగానే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్జీటీ పోస్టుల్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, అసిస్టెంట్‌ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.


Comment As:

Comment (0)