ఎంపీ రఘరామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
అమరావతి: తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం
- By khaja --
- Wednesday, 29 Jun, 2022
అమరావతి: తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. రాజద్రోహం.. ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. పిటిషనర్ రఘురామ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజద్రోహం (ఐపీసీ 124ఎ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో... పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలువరించాలని కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని కోరుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసు పెట్టడం సరికాదని వాదించారు.మరోవైపు సెక్షన్ 124 ఏ అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో.. ఆ సెక్షన్ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరఫున ఏజీ తెలిపారు. మిగిలిన సెక్షన్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం...ఎంపీ రఘురామను హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. విచారణ సమయంలో పోలీసులు హైకోర్టు నిబంధనలు ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
khaja